ఎస్ యానం సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించిన జాతీయ మహిళా బీచ్ బాల్ టోర్నమెంట్ విజయవంతమైంది. ఈ పోటీల్లో మొత్తం 8 రాష్ట్రాల జట్లు పాల్గొనగా, తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కోనసీమ జిల్లాలోని పచ్చదనం, సహజసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు.
మూడవ రోజున అట్టహాసంగా ముగిసిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టిడిపి నేత రెడ్డి సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. బీచ్ వాలీబాల్ ఆర్గనైజేషన్ బాగా నిర్వహించారని, ఇక్కడి వాతావరణం ఎంతో ఆనందాన్ని కలిగించిందని క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.
ఎస్ యానం బీచ్ వేదికగా మూడు రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకూ, కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ఆనందరావు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సంక్రాంతి మరియు కోనసీమ ఉత్సవాలు ఇక్కడ నిర్వహించాలని ఆయన ప్రకటించారు.
ఎస్ యానం సముద్ర తీర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతం ఆంధ్రాగోవా గా ప్రాచుర్యం పొందుతుందని స్థానిక నేతలు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ కు అమెరికా సహా వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు, ఇది స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

 
				 
				
			 
				
			 
				
			