మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన రైతుల పై ఆగ్రహానికి వస్తున్నారని రైతులు అంటున్నారు. సన్న రకం ధాన్యం జాలి పట్టి తూకం వేయాల్సి ఉండగా పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో జాలి మిషన్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో రైతులు ఒక్క బస్తాకు సుమారు రెండు కిలోల వరకు ధాన్యం నష్టపోతున్నారు. 41.300 గ్రాముల తూకం వేయాల్సి ఉండగా 43.300(రెండు కిలోలు) అదనంగా తూకం వేస్తూ నిర్వాహకులు రైతులను దోచుకుంటున్నారని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అంటున్నారు.
కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసాన్ని గుర్తించిన ఒక రైతు ఇదేమిటని ప్రశ్నించగా తక్షణమే సగంలో ఆ రైతుకు సంబంధించిన కొనుగోలును నిలిపివేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సీఈవో హుకుం జారీ చేశారు. ఒక్క రైతు నుంచి ఒక్కో సంచిలో సుమారు రెండు కిలోలు అంటే వందల మంది రైతుల… నుంచి కొన్ని వేల కిలోల ధాన్యం మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. ఇట్టి విషయమై సంబంధిత సీఈఓ ను వివరణ కోరగా… సీఈఓ కు బదులుగా సంబంధిత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నార్సింగి లోని కొందరు కీలక వ్యక్తులు సమాధానం చెబుతున్నారు. రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కలిసి మోసాలకు పాల్పడుతున్నారని, ఇట్టి విషయంపై వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.
