గుడివాడ శివారు ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే రాము వెంటనే అధికారులను పిలిపించి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గుడివాడలో సమస్యల పరిష్కారానికి నాంది పలికామని, రోడ్ల సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం తన లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అమృత్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్న పైప్ కనెక్షన్ల పనులు తక్షణమే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శివారు ప్రాంతాల్లో మున్సిపల్ పైప్ లీకేజీలను పరిశీలించి మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాబోయే వేసవిలో గుడివాడ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కొనసాగిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
