రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గిరిజనేతర పేదలకు గృహాలు మంజూరు చేయాలని మాత్రమే కోరానని, అయితే కొందరు అర్ధం చేసుకోకుండా తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“నాకు గిరిజనుల సమస్యలు తెలుసు, నన్ను తప్పుడు ప్రచారానికి గురిచేయొద్దు” అంటూ మండిపడ్డారు. తాను గిరిజన కుటుంబంలో జన్మించానని, గిరిజనులకు అన్యాయం చేసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “నా వేలుతోనే నా కన్ను పొడుచుకునేదిలా గిరిజనులపై అన్యాయం చేయను” అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో తాను గిరిజనేతరుల కోసం గృహాల మంజూరును మాత్రమే ప్రస్తావించానని, కానీ “గిరిజనుల హక్కులకు భంగం కలిగించే ఉద్దేశం అసలు లేదు” అని స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థపరులు తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గిరిజనులు, గిరిజనేతరులు సమానంగా అభివృద్ధి చెందాలని తన లక్ష్యమని, “రంపచోడవరం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఎప్పుడూ గిరిజనులకు అండగా ఉంటాను” అని ఎమ్మెల్యే శిరీష దేవి హామీ ఇచ్చారు.

 
				 
				
			 
				
			 
				
			