గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా స్పందించారు. గత ఏడాది ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే ఈ సంవత్సరం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరపడం గర్వకారణంగా ఉందన్నారు. ఏదైనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే మహోన్నత నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే బాధ్యతను భుజాలపై వేసుకుని అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు విదేశాల్లో జరగడం ఆయన విశ్వవ్యాప్త ప్రతిష్ఠకు నిదర్శనమని చెప్పారు. మోడీ తర్వాత దేశ రాజకీయాల్లో చంద్రబాబుకు సాటివారుండరని తెలిపారు. తెలుగువారు అందరూ ఆయనకు రుణపడి ఉండాలని అభిప్రాయపడ్డారు. హైటెక్ హైదరాబాద్ రూపుదిద్దుకున్న తీరునే, అమరావతిని కూడా ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసే కృషిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. వచ్చే తరాల కోసం పని చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని టార్గెట్ చేయకుండా ప్రజల మేలు కోసం పనిచేయడమే చంద్రబాబు ధ్యేయమని చెప్పారు. గత ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాలను క్షమిస్తూ… రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని తెలిపారు. ఐదేళ్లపాటు విమర్శలు చేసినవారు చంద్రబాబు గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. చట్టపరంగా వ్యవహరించడమే ఆయన నైజమని తెలిపారు.
చంద్రబాబు 2047 విజన్ తెలుగు ప్రజల భవిష్యత్తు మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు. ఆయన ఆశయాలను, ప్రవాసాంధ్రుల పీ4 కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలుగు ప్రజలందరి అభివృద్ధికే చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఆరాధ్యదైవమైతే, చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. వందేళ్ల పాటు అదే ఉత్సాహంతో పని చేస్తూ తెలుగు వారికి గర్వకారణంగా మారాలని ఆకాంక్షించారు.