నారాయణపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు పట్టా భూమి కలిగిన రైతుల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని తెలపడంతో, పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ఆందోళనకు దిగారు. రైతులు 80% మంది పట్టా పొందలేకపోయిన కారణంగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు తమ సమస్యలను ఉంచుతూ 1/70 యాక్ట్ కారణంగా పట్టాలు లభించలేదని పేర్కొన్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించి 4C ఆధారంగా మాత్రమే వ్యవసాయం చేస్తామని, కానీ తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తమ జీవనాధారం ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను సంప్రదించి రైతుల సమస్యలపై స్పష్టతను పొందారు. తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ఆందోళన చెందవద్దని, ఆధార్ కార్డు లేదా వ్యవసాయ భూమికి సంబంధించిన ఆధారాలు ఉంటే చాలని ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, నాయకులు జక్కుల రాంబాబు, రాయగిరి మల్లేశ్వరరావు, చందా లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.
