అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన అత్యంత అమానుషమని, హేయమని, దీనిని ప్రతీఒక్కరూ ఖండించాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. గంట్యాడ మండలంలోని ఒక గ్రామంలో అత్యాచారానికి గురై, విజయనగరం ఘోషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడున్నర ఏళ్ల బాలిక కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి సోమవారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు. మెరుగైన చికిత్సను అందించాలని, అవసరమైన ఇతర వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.
             ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. మానవత్వాన్ని మంట గలిపిన ఇటువంటి మానవ మృగాలకు కఠినంగా శిక్షపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి బెయిల్ ఇప్పించవద్దని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు.  ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడేవిధంగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు వెళ్లడించారు. తల్లితండ్రులు ఆడపిల్లలతోపాటు మగ పిల్లలకు కూడా మంచిచెడుల విచక్షణను బోధించాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, ఇటువంటి సంఘటనలకు పాల్పడినవారిని చట్టానికి అప్పగించాలని కోరారు. మన ఆడపిల్లలను రక్షించుకొనే బాధ్యత మనపైనా ఉందని మంత్రి అన్నారు.
               ఎస్‌పి వకుల్ జిందాల్ మాట్లాడుతూ, గంట్యాడ మండలంలో జరిగిన ఈ దుర్ఘటన గురించి వివరించారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని, శాస్త్రీయంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, విచారణ జరిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి సంధ్యారాణితోపాటు ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, ఆసుపత్రి వైద్యులు ఉన్నారు.
 
				 
				
			 
				
			 
				
			