రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఏలూరు జిల్లా గిరిజన ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పులిరాముడిగూడెం గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజలతో నేరుగా ముఖాముఖి చర్చలు జరిపారు. త్రాగునీటి సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలియజేయగా, మంత్రి వెంటనే స్పందించారు.
ప్రజల సమస్యలపై తక్షణమే చర్యలకు పాల్పడిన మంత్రి, సంబంధిత అధికారులు ఐటీడీఏ మరియు ఆర్‌డబ్ల్యూఎస్‌కి ఆదేశాలు జారీ చేశారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతోపాటు, తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం వెంటనే కార్యాచరణ ప్రారంభించింది.
ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామానికి రోజూ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ. 2.50 లక్షలు మంజూరయ్యాయి. పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.71 కోట్లు విడుదల చేసింది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిని గిరిజనులు ప్రశంసిస్తున్నారు. త్రాగునీటి కోసం చేసిన ప్రయత్నాలు, నిధుల మంజూరుతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తాము జీవితాంతం మంత్రికి రుణపడి ఉంటామని పులిరాముడిగూడెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నాదెండ్ల ప్రజల కోసం పనిచేసే అసలైన ప్రజాప్రతినిధిగా నిలిచారని కొనియాడుతున్నారు.
