విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెంటాడ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు మాట్లాడుతూ, అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరులో మంత్రి సంధ్యారాణిపై చేసిన విమర్శలు తగవని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారని అన్నారు. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
శంబరలో పోలమాంబ అమ్మవారి జాతరను దృష్టిలో ఉంచుకుని గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంధ్యారాణి సాధించారని చెప్పారు. విమర్శలు చేయడం కంటే అభివృద్ధికి సహకరించాలని, ప్రజల సంక్షేమం కోసం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి పని చేయాలని పీడిక రాజన్నదొరకు సూచించారు.
ఈ సమావేశంలో మేడపల్లి ఎంపీటీసీ, సాలూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ఎర్రి నాయుడు, టిడిపి సీనియర్ నేతలు కొరుపిల్లి చిన్నం నాయుడు, కొల్లి అప్పారావు, గొర్లె ముసలి నాయుడు, పడాల గంగులు, టిడిపి కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.