మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సొషియో ఫాంటసీ సినిమాలో మెగా హీరో సాయి తేజ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సాయి తేజ్ పాత్ర కోసం మూడురోజుల షూటింగ్ ప్లాన్ చేశారు. ఈరోజు ఆయన తొలి షెడ్యూల్‌లో పాల్గొన్నారని సమాచారం. గతంలో చిరంజీవి సినిమాల్లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చినట్లు ఇప్పుడు సాయి తేజ్ కూడా మెగాస్టార్ సినిమాలో కనిపించడం అభిమానులను ఆకట్టుకునే అంశంగా మారింది.
ఇదిలా ఉంటే, ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సమాచారం. కొన్ని పాటలు, కొద్దిపాటి ప్యాచ్‌వర్క్ మినహా మొత్తం షూటింగ్ పూర్తి కావొచ్చని తెలుస్తోంది. అయితే, సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేసినందున, వీటిపై మరింత సమయం ఖర్చు చేయాల్సి వస్తుందని టాక్.
ఇంతకుముందు మేకర్స్ ప్రకటించినట్లు మే నెలలో సినిమా విడుదల కావడం కష్టమని సమాచారం. ఎఫ్‌ఎక్స్ బ్లాక్స్ పూర్తయిన తర్వాత మాత్రమే అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు. మెగాస్టార్ అభిమానులు అయితే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.