నాయుడుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రాజెక్ట్ కార్యదర్శి ఎన్. శ్యామలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి. మునిరాజా, శివకవి ముకుంద తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను పలుమార్లు కోరినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
అంగన్వాడీలు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. సాధికారత సర్వేలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా లెక్కించకూడదని, సేవలో ఉండి మరణించిన వారికి రూ.20,000 దాన సంస్కార ఖర్చులుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్‌లో ఉన్న టీ.ఏ బిల్లులను తక్షణమే చెల్లించాలని, అన్ని యాప్‌లను ఒకే యాప్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఉచిత గ్యాస్ సరఫరా, మెను ఛార్జీలు పెంపు, ప్రీస్కూల్ బలోపేతంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఐదు సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో ఉంచేలా జీవో విడుదల చేయాలని, సాయంత్రం స్నాక్స్ అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళావతి, పుష్పలత, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలు అమలు చేయాలని కోరారు.

 
				 
				
			 
				
			 
				
			