అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పునరాగమనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమానికి దిగారు. ‘హ్యాండ్సాఫ్’ పేరిట 50 రాష్ర్టాల్లో 1400 ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించబడ్డాయి. ఇటీవలే అధ్యక్ష పదవిని తిరిగి స్వీకరించిన ట్రంప్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, ముఖ్యంగా వలసదారులపై చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు, వాణిజ్య యుద్ధాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళల ఉద్యమం (2017), బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (2020) తర్వాత అతి పెద్ద ప్రజా నిరసనగా అభివర్ణించబడుతోంది.
ఈ నిరసనల్లో ప్రజలు స్పష్టమైన డిమాండ్లు చేశారు. బిలియనీర్ల పెత్తనాన్ని అరికట్టాలని, ప్రభుత్వ అవినీతిని తొలగించాలని, మెడికెయిడ్, సోషల్ సెక్యూరిటీ వంటి పథకాలకు నిధుల కోతను నిలిపివేయాలని కోరారు. వలసదారులు, ట్రాన్స్‌జెండర్లు, ఇతర మైనారిటీ గ్రూపులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ట్రంప్ వేసిన టారిఫ్ పన్నులపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెంగ్విన్లపై కాదు, సంపన్నులపై పన్నులు వేయండి” అని రాసి ఉన్న ప్లకార్డులు జనసమూహంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సియాటిల్, అట్లాంటా, బోస్టన్ నగరాల్లో ప్రజలు మస్క్ జోక్యంపై కూడా మండిపడ్డారు. “ఇంపీచ్ ట్రంప్”, “డిపోర్ట్ మస్క్”, “హ్యాండ్సాఫ్ అవర్ డెమొక్రసీ” వంటి నినాదాలతో వీధుల్లో గళం విప్పారు. ప్రభుత్వ విధానాలపై మస్క్ ప్రಭావాన్ని తీవ్రంగా విమర్శించారు. మస్క్‌కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్లకార్డులు దర్శనమిచ్చాయి.
ఈ ర్యాలీలను 150కి పైగా సంఘాలు మద్దతివ్వగా, లేబర్ యూనియన్లు, ఎల్‌బీజీటీక్యూ కార్యకర్తలు, న్యాయవాదులు, వృద్ధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నిరసనలపై శ్వేత సౌధం స్పందిస్తూ, ట్రంప్ పథకాల ఉద్దేశం న్యాయంగా అర్హులైన వారికి మద్దతు ఇవ్వడమేనని తెలిపింది. గత పాలనల్లో అక్రమంగా లబ్ధిపొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండిందని పేర్కొంది. అయితే ప్రజల నిబద్ధత, శాంతియుత నిరసన పద్ధతికి అనేక వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.