బద్వేలు ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి (DHPS), ఏపీ గిరిజన సమైక్య, దళిత డప్పు కళాకారుల సంఘం (DDKS) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూమి కోసం ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డమాను వీరశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలక ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయని, అర్హులైన పేదలకు 2 ఎకరాల భూమి కేటాయించడంలో విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, వంకలు, చెరువులు, ఇనాం, వక్స్ భూములను అక్రమంగా కబ్జా చేసే మాఫియాలకు సహకారం అందిస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన రీ సర్వే, 22ఏ చట్ట సవరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలవుతే పేదలకు సంబంధించిన భూములు కోల్పోతాయని పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవసాయ కార్మికులు నష్టపోతారని, భూమి కోసం గతంలో నెగ్గిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉల్లంఘనకు గురవుతోందని తెలిపారు.
అనవసర భూ వివక్షకు పాలక ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలని, అధికారులు ప్రతి గ్రామంలో అర్హులైన పేదల జాబితా తయారు చేసి, అసైన్డ్ కమిటీకి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాలే బడుగు బలహీనవర్గాల హక్కుల సాధనకు మార్గం అని నాయకులు స్పష్టం చేశారు.
