మంచు విష్ణు నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమాను వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా హాజరయ్యారు. సీఎం యోగి సినిమా టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ దృశ్యాలు, కథాకథనాలు సినిమాపై మరింత అంచనాలను పెంచుతున్నాయి. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు శివ భక్తుడిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
