తిరుపతిలో మోహన్ బాబు విద్యాసంస్థల సమీపంలోని రెస్టారెంట్‌పై బౌన్సర్లు దాడి చేయడాన్ని మంచు మనోజ్ తీవ్రంగా ఖండించారు. రెస్టారెంట్ యజమాని భయంతో పారిపోయిన పరిస్థితి దారుణమని అన్నారు. బౌన్సర్లను వెంటనే తొలగించాలని, స్థానిక ఎమ్మెల్యే, అధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. తాను గతంలోనే బౌన్సర్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వెల్లడించారు.
రెస్టారెంట్ ఘటనపై తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని, ప్రతి ఒక్కరినీ భయపెట్టేలా బౌన్సర్లు వ్యవహరిస్తున్నారని మనోజ్ మండిపడ్డారు. గొడవ జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజీ తీసుకెళ్లారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తన ఇంటి దగ్గరైనా, ఇతరత్రా చోట్లా ఇదే పద్ధతిలో సీసీటీవీ ఫుటేజీలు తీసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, భయంతో బతకాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తన తండ్రి పదిమందికి మంచి చేయాలని ఈ విద్యాసంస్థలు ప్రారంభించారని, కానీ ఇప్పుడు ఈ క్యాంపస్ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసని అన్నారు. గత మూడేళ్లుగా అన్యాయాలు జరుగుతున్నాయని, దీనిపై తాను ప్రశ్నిస్తే తనపై అభాండాలు వేస్తున్నారని తెలిపారు. తన భార్య, పిల్లలపైనా వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆస్తి గొడవ చేయడం లేదని, ఇది ఆత్మగౌరవ పోరాటమని అన్నారు.
ఇలాంటి బెదిరింపు ధోరణిని అంతం చేయాలని విజ్ఞప్తి చేసిన మనోజ్, విష్ణు, వినయ్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ప్రేమతోనే ప్రతిదీ పరిష్కారం చేయాలని, మనమంతా ఒక కుటుంబమని వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారానికి ప్రేమ, అవగాహన అవసరమని, బౌన్సర్లతో భయపెట్టడం తగదని హెచ్చరించారు.

 
				 
				
			 
				 
				