ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామ సమీపంలోని ఎన్ఎస్పి కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గాయపడిన వారిని మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వరరావు, కుంచం వెంకటరావులుగా గుర్తించారు. వారు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం నూజివీడు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానికులు వెంటనే నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రమాదం చేసిన కారు యజమాని ప్రమాదం అనంతరం పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారైన కారు యజమానిని గుర్తించే పనిలో ఉన్నారు. స్థానికులు అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
