దేశంలో పలు రాష్ట్రాల్లో లవ్ జిహాద్‌పై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం డీజీపీ సంజయ్ వర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు, సామాజిక న్యాయం, న్యాయ వ్యవస్థ, హోం శాఖలకు చెందిన కీలక అధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలను విశ్లేషించి, లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడిపై ప్రత్యేక చట్టానికి రూపకల్పన చేస్తోంది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి. గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లవ్ జిహాద్‌పై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్ర కూడా త్వరలో అదే మార్గాన్ని అనుసరించనుంది.
ఈ చట్టానికి సంబంధించి కమిటీ పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించనుంది. త్వరలో ఈ చట్టంపై మరింత స్పష్టత రానుంది.