మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సందేశం రాగా, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఈ మెసేజ్‌ను మాలిక్ షాబాజ్ హుమాయున్ అనే వ్యక్తి పంపినట్టు గుర్తించారు.
బెదిరింపు సందేశం నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర కీలక ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై కేంద్ర సంస్థలు కూడా ఆరా తీస్తున్నాయి. నిందితుడి వివరాలను గుర్తించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా పనిచేస్తున్నాయి. పాకిస్థాన్ నంబర్ నుంచి ఇలాంటి సందేశం రావడం ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు.
భద్రతా విభాగం ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురు అనుమానితులపై విచారణ జరుపుతున్నారు. సీఎం భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు.