మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో నగరానికి వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, 25 కిలోమీటర్ల మేర వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా మార్గాల్లో భారీగా రద్దీ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఏడు ప్రధాన రహదారుల వద్ద 20 కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులు పుణ్యస్నానం చేయడానికి కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే వాహనాలను ఆపివేస్తున్నారు. కనీసం 50 వేల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు తాగునీరు, ఆహారం, తాత్కాలిక వసతి అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ భక్తుల రద్దీ వల్ల ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను ఫిబ్రవరి 14 వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా సందర్బంగా ఉభయ గోదావరి, నర్మదా, యమునా తీరప్రాంతాల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
