తెనాలి గంగానమ్మపేటలోని రామేశ్వరస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. త్రేతాయుగంలో పరశురాముడు స్వయంగా ఈ ఆలయాన్ని ప్రతిష్టించారని శాసనాలు చెబుతున్నాయి. స్వామివారు పశ్చిమ ముఖంగా దర్శనం ఇస్తారు. బాణలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో, స్వామి గౌరి శంకరాత్మక స్వరూపంలో గోధుమ వర్ణంతో భాసిస్తున్నారు.
ఈ ఆలయంలోని ఉత్సవ మూర్తులను తెనాలి రామకృష్ణ కవి ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తుంది. ఆలయంలో మరో విశేషం 8,9వ శతాబ్దాల నాటి జైనతీర్థం కరుడి విగ్రహం ఉండడం. ఇది పురాతన జైన ఆచారాలను సూచించగా, శైవ భక్తులకు ప్రధాన దివ్యక్షేత్రంగా మారింది.
ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక అలంకారంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
అభిషేకం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. విశేష పూజల సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. పండుగ వేళ స్వామి దర్శనానికి తెనాలి, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు.

 
				 
				
			 
				
			 
				
			