మలయాళ సినిమాలకు ఎంతగా క్రేజ్ ఉందో, వెబ్ సిరీస్ లకు కూడా అంతే ఆదరణ లభిస్తోంది. తాజాగా, మరో మలయాళ వెబ్ సిరీస్ ‘లవ్ అండర్ కన్ స్ట్రక్షన్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రెంజిత్ నిర్మించిన ఈ సిరీస్ కి విష్ణు జి. రాఘవన్ దర్శకత్వం వహించగా, అజూ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించారు.
ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్, మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
కథ విషయానికి వస్తే, ఒక జంట తమ సొంత ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన అనేక అనుకోని సంఘటనలు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనేది కథాంశం.
ఈ సిరీస్ లో నీరజ్ మాధవ్, గౌరీ కిషన్, కిరణ్ పీతాంబరన్, ఆనంద్ మన్మథన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సమకాలీన కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందని భావిస్తున్నారు.
