హనుమాన్ జయంతి నేపథ్యంలో హైదరాబాద్‌లోని మందుబాబులకు నిరాశ కలిగించే వార్త వెలువడింది. ఈ పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
రాజధానిలో శాంతిభద్రతలు, సామాజిక సమతుల్యతకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గతంలో శ్రీరామ నవమి సందర్భంగా కూడా ఇలాగే మద్యం షాపులు మూసివేయడం జరిగింది. అదే విధంగా హనుమాన్ జయంతి వేళ కూడా ప్రజల్లో మద్యం వల్ల గందరగోళం రాకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
వైన్ షాపులు మాత్రమే కాకుండా, బార్లు, కల్లు కాంపౌండ్‌లు కూడా ఈ నిషేధానికి లోబడి ఉంటాయి. నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మద్యం విక్రయం, పంపిణీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లభించవని స్పష్టం చేశారు.
పౌరులు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని పోలీస్ శాఖ సూచించింది. అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జనసామాన్యానికి అసౌకర్యం కలగకుండా ముందుగానే హెచ్చరికలు ఇచ్చారు.