ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి – బూర్జ మండలాల్లో క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు అనుకూలమైన భూస్ధితులు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజినీర్ల కమిటీ పర్యటించింది. స్థానిక శాసన సభ్యులు కూన రవి కుమార్ గారి సమక్షంలో ఈ పరిశీలన జరిగింది.
ఈ పరిశీలనలో భూమి స్వాధీనం, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వనరుల పరిశీలన, భవిష్యత్‌లో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభావం వంటి అంశాలను అధికారుల బృందం విశ్లేషించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యుత్ అవసరాలకు సకాలంలో సరఫరా జరిగే అవకాశాలు ఉంటాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శివ్వాలా సూర్యం, మార్కుఫెడ్ స్టేట్ డైరెక్టర్ అనేపు రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు అంబాల రాంబాబు, అలాగే ఎలక్ట్రికల్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని అధికారుల బృందం అభిప్రాయపడింది.
ప్రాజెక్ట్‌పై గ్రామస్థుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని, పరిసర ప్రాంతాల పరిణామాలను సమగ్రంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. భవిష్యత్‌లో పర్యావరణ అనుమతులు, భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			