‘లైలా’ కథానాయకుడు విష్వక్ సేన్ లేడి గెటప్‌లో కనిపించడం సినిమాకు ప్రధాన హైలైట్‌గా ప్రచారం జరిగింది. పృథ్వీరాజ్ కామెంట్స్ వల్ల కూడా హైప్ వచ్చినా, ఈ హైప్ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడిందో అనేది ప్రారంభ వసూళ్లే చెబుతున్నాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
హైదరాబాద్ పాతబస్తీలో సోను (విష్వక్ సేన్) బ్యూటీ పార్లర్ నడుపుతాడు. తన పార్లర్‌కు వచ్చిన ఓ కస్టమర్‌కు సహాయం చేసి, ఆమె కుకింగ్ ఆయిల్ బిజినెస్‌కు అంబాసిడర్‌గా మారుతాడు. మటన్ వ్యాపారి రుస్తుం (అభిమన్యు సింగ్) పెళ్లి చేసుకునే అమ్మాయి అందం కేవలం మేకప్ వల్లనని తెలుసుకొని సోను పై మండిపడతాడు. పెండ్లి విందు తర్వాత ఫుడ్ పాయిజనింగ్ జరగడంతో సోను మీద కేసు వస్తుంది. పోలీసులు, రుస్తుం నుంచి తప్పించుకునేందుకు సోను లేడి గెటప్‌లో లైలా అవతారం ఎత్తాల్సి వస్తుంది.
ఈ చిత్రంలో కథనం, స్క్రీన్‌ప్లే పూర్తిగా నాసిరకంగా ఉండటంతో ప్రేక్షకులు విసుగు చెందుతారు. లేడి గెటప్‌లో హీరో కనిపించడమే ప్రధాన అట్రాక్షన్‌గా పెట్టుకోవడం తప్ప కథకు సరైన బలమైన కారణం లేదు. కామెడీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా సినిమాను లాగించారని అనిపిస్తుంది. కథాపరంగా, సన్నివేశాల పరంగా చాలా అలోచించాల్సిన అవసరం ఉన్నా, దర్శకుడు రామ్ నారాయణ అందులో విఫలమయ్యారు.
విష్వక్ సేన్ సోను పాత్రలో ఓకే అనిపించినా, లేడి గెటప్‌లో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ పాత్రను కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితం చేశారు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. టెక్నికల్‌గా సినిమా కేవలం కలర్‌ఫుల్‌గా కనిపించినా, కథాబలం లేకపోవడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా ‘లైలా’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచే స్థాయిలో ఉందని చెప్పొచ్చు.