ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 190 పరుగులకే పరిమితమై ఓడింది. కేకేఆర్ బ్యాటర్లు అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్‌లు సమిష్టిగా రాణించారు. మ్యాచ్ సజావుగా ముగిసినప్పటికీ ఆఖరులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
మ్యాచ్ అనంతరం కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌తో సరదాగా మాట్లాడుతున్న ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ అతని చెంపపై చేయిచేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొదట నవ్వులతో సాగిన సంభాషన ఒక్కసారిగా సీరియస్ మలుపు తీసుకుంది. రెండోసారి కుల్దీప్ చేయి చేసుకున్నప్పుడు రింకూ ముఖంలో అసహనం కనిపించింది.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎంత సీనియర్ ఆటగాడైనా ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కుల్దీప్‌పై చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐని ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ వ్యవహారం వల్ల ఆటగాళ్ల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, కేకేఆర్ బ్యాటర్లు అందరూ సమిష్టిగా ఆడటంతో 20 ఓవర్లలో 204 పరుగులు సాధించారు. రఘువంశీ 44, రింకూ 36 పరుగులు చేశారు. ఢిల్లీకి చెందిన డుప్లెసిస్ 62, అక్షర్ పటేల్ 43 పరుగులు చేశారు. కానీ వారి ప్రయత్నాలు విజయాన్ని అందించలేకపోయాయి. కేకేఆర్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానం బలపర్చుకుంది.
