తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ హస్తం పార్టీ హామీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన పార్టీని తెలంగాణలో ఓడించామని, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, ‘‘తల్లికి బువ్వ పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు గంగలో కలిపి, ఢిల్లీ ప్రజలకు కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ‘పులకేశిగా’ మారిపోయారని ఆయన సెటైర్లు వేశారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో స్పష్టం చేయాలని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ‘‘ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ ఎవరికి? మహిళలకు రూ.2,500, తులం బంగారం ఎవరికి? రైతు భరోసా రూ.7,500 ఎక్కడ? ఆసరా పింఛన్ రూ.4,000 ఎక్కడ?’’ అంటూ రేవంత్‌ను నిలదీశారు. ఢిల్లీ ప్రజల కోసం హామీలు ఇచ్చే ముందు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
“జాగో ఢిల్లీ జాగో” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను ముగించారు. తెలంగాణలో నికృష్ట పాలన కొనసాగిస్తూనే, ఢిల్లీ ప్రజలకు హామీలు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. ‘‘దమ్ముంటే ఢిల్లీలో కాదు, హైదరాబాద్‌లో గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామంటూ నడిచిరా రేవంత్’’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
