కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో నకిలీ వీడియోలు, ఎడిట్ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా మన్నె క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయిస్తూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, క్రిశాంక్ పోలీసుల విచారణకు తప్పనిసరిగా సహకరించాలని ఆదేశించింది. అలాగే ఇదే వ్యవహారానికి సంబంధించి కొణతం దిలీప్ అనే వ్యక్తికి కూడా నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో క్రిశాంక్‌పై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయనీ, ఇది చట్ట విరుద్ధమనీ, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టబడ్డాయని ఆయన తరఫున న్యాయవాది రమణారావు కోర్టుకు వివరించారు. ఇదంతా ఓపినియన్ ఎక్స్‌ప్రెషన్‌గా చూడాల్సిన వ్యవహారమని వాదించారు.
మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలో, క్రిశాంక్ నకిలీ ఏఐ వీడియోలు తయారు చేసి, భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైరల్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి పేరు జోడిస్తూ అవాస్తవ విషయాలను ప్రచారం చేశారని న్యాయస్థానానికి వివరించారు. తదుపరి విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.