బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో వరుసగా పెవిలియన్‌కు క్యూకడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా 44 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పారేసుకుంది. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1)లను మిచెల్ స్టార్క్ ఔట్ చేస్తే.. విరాట్ కోహ్లీ (3)ని హేజిల్‌వుడ్, రిషభ్ పంత్ (9)ను ప్యాట్ కమ్మిన్స్ బోల్తా కొట్టించారు.
అయితే, కోహ్లీ మరోసారి ఆఫ్‌సైడ్ అవతల పడ్డ బంతిని ఆడబోయి వికెట్ పారేసుకోవడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే తరహాలో విరాట్ ఔటవ్వడం ఈ మధ్య పరిపాటిగా మారిందని లిటిల్ మాస్టర్ అన్నారు.
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ చేసింది 3 పరుగులే అయినా ఓ రికార్డును అందుకోవడం విశేషం. భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న ఓ పెద్ద రికార్డును అధిగమించాడు. తద్వారా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.
ద్రవిడ్ ఆస్ట్రేలియాపై 62 ఇన్నింగ్స్‌లో 2,166 రన్స్ చేశాడు. ఇప్పుడు కోహ్లీ 48 టెస్ట్ ఇన్నింగ్స్‌లో 2,168 పరుగులు సాధించాడు. అలా ద్రవిడ్ రికార్డును అధిగమించి, ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా అవతరించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(3,630), వీవీఎస్ లక్ష్మణ్ (2,434) పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలాఉంటే.. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో వరుణుడు పదేపదే ఆటంకం కలిగిస్తున్నాడు. మూడో రోజు మూడో సెషన్‌లో వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 14.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (30), రోహిత్ శర్మ (0) ఉండగా.. టీమిండియా ఇంకా 397 రన్స్ వెనుకబడి ఉంది.
