కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు తమపై కేసులు నమోదవుతున్నాయని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు, నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గత నవంబరులో విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసు తమపై రాజకీయ కక్షతో పెట్టినదని, దీనిని కొట్టివేయాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించాలని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తాజా ఆదేశాలతో కొడాలి నానికి స్వల్ప ఊరట లభించినట్లు కనిపిస్తోంది. అయితే, కేసు పూర్తిగా కొట్టివేయాలన్న ఆయన అభ్యర్థనపై కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగనుంది. న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుందన్న హైకోర్టు ఆదేశాలతో, కొడాలి నానికి తాత్కాలికంగా అరెస్ట్ భయం తప్పినట్లయింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై విచారణలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ కేసుపై వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైకోర్టు ఆదేశాలు అనంతరం పోలీసులు తదుపరి చర్యలు తీసుకోవడం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.