అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు తనకు తెలిసిందని చెప్పారు. అయితే, అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానని హెచ్చరించారు.
కేఏ పాల్ మాట్లాడుతూ, పుష్కరాల సహా ఇతర ఘటనల్లో మరణించిన వారి విషయంలో మాత్రం చంద్రబాబుకు ఎందుకు బాధ్యత వహించనివ్వలేదని ప్రశ్నించారు. కందుకూరులో చంద్రబాబు ర్యాలీ సమయంలో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందారని గుర్తుచేశారు. 2019లో పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోవడం సంచలనం సృష్టించిందని అన్నారు.
సాధారణ వ్యక్తులు, నటులు, రాజకీయ నాయకుల మధ్య వేరొక న్యాయం ఉందా? అని కేఏ పాల్ నిలదీశారు. అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవడం సరే… మరి చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయాలు జరగకూడదని, న్యాయం ప్రతి ఒక్కరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.