‘జిద్దీ గర్ల్స్’ వెబ్ సిరీస్ కాలేజ్ లైఫ్ నేపథ్యంలో రూపొందించిన హిందీ సిరీస్. నేహా వీణశర్మ కథ-దర్శకత్వం వహించగా, ప్రీతిష్ నంది ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందించబడింది. కాలేజ్ లైఫ్‌ను, విద్యార్థుల మధ్య భావోద్వేగాలను, స్వేచ్ఛ కోసం చేసే పోరాటాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు.
కథ ప్రకారం, ఢిల్లీలోని ఓ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీలో చదివే యువతులు తమ స్వేచ్ఛ, అభిరుచుల కోసం చేసే పోరాటం, వారి వ్యక్తిగత జీవితం, ప్రేమ, ధైర్యం, ఒత్తిడులు కథను నడిపిస్తాయి. కాలేజ్ ప్రిన్సిపాల్ మార్పుతో విద్యార్థుల జీవితాల్లో వచ్చే మార్పులను, వారి పోరాటాలను దర్శకుడు చూపించాడు. విద్యా వ్యవస్థ, హాస్టల్ లైఫ్, స్టూడెంట్స్‌పై ఉన్న నియంత్రణను ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
సిరీస్‌లో ప్రేమ, శృంగారం, విభిన్న పాత్రల మధ్య సంబంధాలు ప్రధానంగా నిలిచాయి. ఎమోషన్స్ పరంగా గొప్పగా కనెక్ట్ చేయలేకపోయినప్పటికీ, యువత మధ్య ఆకర్షణ, విభేదాలు, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు మోస్తరు ఆసక్తిని కలిగిస్తాయి. స్టూడెంట్స్ వ్యక్తిగత అభిప్రాయాలు, సమాజపు నియంత్రణ మధ్య సంభవించే సంఘర్షణలను ఎలివేట్ చేయాలని ప్రయత్నించినా, పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయింది.
కథ, విజువల్స్, నటన పరంగా ఫరవాలేదనిపించినా, ఎక్కువగా లవ్, రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉండటంతో కాలేజ్ డ్రామాగా కాకుండా, మరో యూత్ సెరిస్‌లా మారిపోయిందనిపిస్తుంది. సీరీస్ పేరుకు తగినంత ‘మొండి మనస్కత’ చూపించలేకపోవడం, కొన్ని పాత్రలు మామూలుగానే ఉండిపోవడం ప్రధాన లోపంగా నిలిచింది. 80s, 90s స్టూడెంట్స్ దీనిని చూసి ‘మన కాలేజీ డేస్ ఇలా ఉండాల్సింది’ అనే ఆలోచనలో పడొచ్చు!
