అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబసమేతంగా సోమవారం భారత్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో భేటీ అనంతరం విందులో పాల్గొన్న వాన్స్ కుటుంబం, ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకుని రాజస్థానీ సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు. మంగళవారం ఉదయం వారు అంబర్ కోటను సందర్శించారు.
అక్కడ వాన్స్ కుటుంబానికి సాంప్రదాయ రాజస్థానీ నృత్యాలతో, శోభాయమానమైన ఏనుగులతో ఘనంగా స్వాగతం పలికారు. ఇది చూసిన పర్యాటకులు మరియు స్థానికులు ఆశ్చర్యపోయారు. వాన్స్ కుటుంబం ఆనందంగా రాజస్థానీ సంస్కృతిని ఆస్వాదిస్తూ అక్కడి సాంప్రదాయ కళలకు ప్రశంసలు కురిపించారు.
వాన్స్ రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అమెరికా-భారత సంబంధాలపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి రాంబాగ్ ప్యాలెస్‌లో బస చేస్తున్నారు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ సందర్శన అనంతరం బుధవారం ఉదయం వారు ఆగ్రాకు వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో అక్షరధామ్ ఆలయం సందర్శన ప్రత్యేకంగా నిలిచింది. వాన్స్ పిల్లలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. కుమారులు కుర్తా పైజామాలో మెరిశారు, కుమార్తె అనార్కలి స్టైల్ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పర్యటన భారత సంస్కృతికి అద్భుతమైన అద్దంపట్టింది.

 
				 
				
			 
				
			 
				
			