ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ కరెన్సీ ‘రియాల్’ విలువ డాలర్‌తో పోల్చినప్పుడు భారీగా పడిపోయింది. 2015లో 32,000 రియాల్స్‌గా ఉన్న విలువ ప్రస్తుతం 9,50,000 రియాల్స్‌కు చేరింది. ఈ కరెన్సీ పతనం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. దీనికి బాధ్యుడిగా చూస్తూ ఇరాన్ పార్లమెంట్ ఆర్థిక మంత్రి అబ్దోల్‌నాసెర్ హెమ్మతిని అభిశంసించింది. మొత్తం 273 సభ్యుల్లో 182 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ 2023 జులైలో పదవి చేపట్టినప్పుడు రియాల్ విలువ 5,84,000గా ఉంది. కానీ ఆరు నెలల్లోనే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం ఒక్క డాలర్‌కు 10 లక్షల రియాల్స్ చెల్లించాల్సిన స్థితి వచ్చింది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు విఫలమవుతున్నాయన్న విమర్శలు ఉద్ధృతమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి పలు కారణాలు ఉన్నాయి. 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్య నిషేధాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. ప్రపంచంలోని అత్యల్ప విలువ కలిగిన కరెన్సీల్లో రియాల్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది.
ఆర్థిక మంత్రి హెమ్మతిపై పార్లమెంట్ ఒత్తిడి పెరిగినప్పటికీ, అధ్యక్షుడు మసౌద్ ఆయనను వెనకేసుకొచ్చారు. ఒక్క వ్యక్తిని ఇందుకు బాధ్యుడిగా చూడడం తగదని, ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిందని చెప్పారు. ఇరాన్‌లో పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నాలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
