నాగోల్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంప్‌లను మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆవిష్కరణ, రూపకల్పన, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి హాజరై, పీఏమై నరేంద్ర మోదీ ఊహించిన విధంగా ఈ కార్యక్రమాలు విద్యార్ధుల ఆవిష్కరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, పాఠశాలలు మరియు ఉన్నత విద్యాసంస్థల నుండి ఇన్నోవేషన్ అంబాసిడర్లను తయారుచేసే దిశగా కొనసాగిస్తున్నాయని తెలిపారు.
బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు ప్రభుత్వ విధానాలు, సమర్థవంతమైన శిక్షణ, మరియు సహకారం ద్వారా విద్యార్థులకు వ్యాపార ఆవిష్కరణల్లో ముందంజ వేసేందుకు అవకాశాలను కల్పించాయన్నారు. విద్యార్థులకు ఆధునిక రంగాలలో సరైన దిశా నిర్దేశం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వసించారు.
కంప్యూటింగ్, ఇంజనీరింగ్, మరియు ఇతర శాస్త్రాలలో నూతన ఆవిష్కరణలకు దారితీసే ఈ బూట్ క్యాంప్ కార్యక్రమం మరింతమందికి చేరేలా పల్లవి ఇంజనీరింగ్ కళాశాల ఉత్సాహంగా నిర్వహిస్తోంది.
