అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులపై మరోసారి ట్రంప్ పరిపాలన పంజా వేస్తోంది. అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న లేదా పూర్తి చేసిన స్టూడెంట్స్‌కు ఉద్యోగం సంపాదించుకునే అవకాశంగా నిలిచిన ఓపిటి ఆథరైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని తాజాగా కొత్త బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు అమలవితే స్టెమ్ కోర్సులు చదివిన విదేశీ విద్యార్థులు విద్య పూర్తి చేసిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కలగకుండానే దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఓపిటి ఉండడం వల్లే విద్యార్థులు విద్య అనంతరం అక్కడే ఉద్యోగానికి ప్రయత్నించగలుగుతున్నారు. అయితే ఈ బిల్లు పాస్ అయితే, చదువు పూర్తికాగానే వారు “సెల్ఫ్ డిపొర్ట్” అవ్వాల్సి వస్తుంది. లేకపోతే వారిపై అక్రమ వలసదారులుగా గుర్తింపు లభించి ప్రభుత్వం డిపొర్ట్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే అమెరికాలో సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరంతా OPT ఆధారంగా H-1B వీసాకు ప్రయత్నిస్తున్న సందర్భంలో, ఈ మార్పులు వారిపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై మేఘాల్లా ముస్తాబైంది.