భారత నౌకాదళం వివిధ విభాగాల్లో 270 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి నుంచి పీజీ అర్హత కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఇంటర్వ్యూలో ఎంపిక చేసి నియమిస్తామని నేవీ తెలిపింది. ఇంటర్, డిగ్రీ, పీజీలలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తామని వెల్లడించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందనుంది. సబ్ లెఫ్టినెంట్ హోదాతో నియమితులై, డీఏ, హెచ్ఆర్ఏ సహా ఇతర ప్రోత్సాహకాలతో రూ.1.10 లక్షల వేతనం పొందవచ్చు. ఎన్‌సీసీ అభ్యర్థులకు అకడమిక్ మార్కుల్లో 5% రాయితీ వర్తిస్తుందని నేవీ స్పష్టం చేసింది.
ఎంపికైన అభ్యర్థులకు 22 వారాల ఎజిమాల నేవల్ అకాడెమీలో శిక్షణ, ఆపై మరో 22 వారాల పాటు విభాగాల వారీగా శిక్షణ ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షల అనంతరం నియామకపు ఉత్తర్వులు అందజేస్తారు. బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతాలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు భారత నౌకాదళ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ను సందర్శించాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.