భారత నౌకాదళం తన శక్తిని ప్రదర్శిస్తూ ఒక శక్తివంతమైన ఫోటోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది. ఇందులో దేశ నౌకాదళానికి చెందిన ముఖ్యమైన యుద్ధ నౌక INS కోల్‌కతా, స్కార్పీన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి, ధ్రువ్ ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ సముద్ర గస్తీలో నిమగ్నమై ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ చిత్రం ఇప్పుడు ఆన్‌లైన్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
“త్రిశూల శక్తి: పైన, కింద, అలలపై” అనే శీర్షికతో పోస్టు చేసిన నౌకాదళం, “ఎనీ టైమ్, ఎనీ వేర్, ఎనీ హౌ” అనే క్యాప్షన్ జత చేసింది. ఇది భారత నేవీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని బలంగా సూచిస్తోంది. ఏదైనా పరిస్థితిలో, ఎలాంటి వాతావరణంలోనైనా సముద్రంలో కార్యాచరణ చేపట్టగల సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
ఈ ఫోటో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత-పాక్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫోటోలో కనిపించిన ధ్రువ్ హెలికాప్టర్లు కొన్ని నెలలుగా నిలిపివేసిన తర్వాత ఇటీవల మళ్లీ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో వినియోగానికి అనుమతి లభించింది. కానీ నౌకాదళంలో మాత్రం వాటిని ఇంకా పూర్తి స్థాయిలో తిరిగి ప్రవేశపెట్టలేదు.
ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో సిద్ధమయ్యాయి. ఇవి శత్రు నౌకలు, జలాంతర్గాములను గుర్తించి వాటిపై దాడులు చేయగలవు. నిఘా సమాచారాన్ని సేకరించడంలో, సముద్ర గర్భంలో మైన్స్ అమర్చడంలో కూడా ఇవి ప్రావీణ్యం కలిగి ఉన్నాయి. INS కోల్‌కతా వంటి యుద్ధ నౌకలు భారత నౌకాదళానికి విశ్వసనీయమైన శక్తిగా నిలుస్తున్నాయి.
