భారతదేశం తన పశ్చిమ సరిహద్దులో కీలక చర్యగా అధునాతన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్ఎస్ఎస్) జామింగ్ వ్యవస్థను మోహరించింది. పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే GPS, గ్లోనాస్, బైడు వంటి శాటిలైట్ సేవలకు ఇది అంతరాయం కలిగించనుంది. ఇది వారి విమాన నావిగేషన్, లక్ష్య నిర్ధారణ సామర్థ్యాన్ని బాగా దెబ్బతీయగలదు. భారత చర్యతో పాక్ దళాల గగన వ్యూహంలో అస్థిరత ఏర్పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చర్యకు నేపథ్యం ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి. ఆ ఘటనలో 26 మంది మరణించగా, దానికి ప్రతీకారంగా భారత్ ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు తన గగనతలాన్ని పాక్‌కు మూసివేసింది. ‘నోటం’ ఆదేశాల ప్రకారం, పాకిస్థాన్‌కు చెందిన మిలటరీ, కమర్షియల్, లీజ్డ్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించలేవు. ఈ నిర్ణయానికి ముందే పాక్ విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వచ్చింది.
ఈ పరిణామాలతో పాక్‌కు చెందిన పీఐఏ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. మలేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే విమానాలు శ్రీలంక లేదా చైనా గగనతలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఇది ప్రయాణాన్ని సుదీర్ఘం చేస్తూ, ఇంధన వ్యయం పెరిగేలా చేస్తుంది. సిబ్బంది సేవలపై ఒత్తిడి పెరుగుతుంది. షెడ్యూల్లు ఆలస్యమవుతాయి, ఫ్రీక్వెన్సీ తగ్గించే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, పాక్ పౌరుల వీసాలను కూడా రద్దు చేసింది. తాజా జామింగ్ చర్యతో పాక్ మిలటరీ, విమానయాన రంగంపై వణుకు పుట్టింది. భారత్ నుంచి మరోదఫా దూకుడు చర్యలు వస్తాయన్న భయంతో పాక్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
