ఆసియా కప్ 2025లో మూడు సార్లు తలపడిన భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేయడానికి సిద్ధమయ్యాయి. నవంబర్‌లో జరిగే హాంకాంగ్ సిక్సర్స్ టోర్నమెంట్ మరియు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది.
మొదటగా నవంబర్ 7న హాంకాంగ్‌లోని టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో 6-ఓవర్ల ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఇది హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో తొలి మ్యాచ్. ఈ టోర్నీలో నాకౌట్ దశకు చేరితే, భారత్, పాకిస్తాన్ మరోసారి ఎదురుపడే అవకాశం ఉంది. చిన్న ఫార్మాట్ కావడంతో ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది.
తర్వాత నవంబర్ 14న ప్రారంభమయ్యే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో నవంబర్ 16న ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి. యువ ఆటగాళ్లకు వేదికగా నిలిచే ఈ టోర్నీలో భవిష్యత్ స్టార్ ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్‌లో మళ్లీ ఎదురుపడితే, ఈ టోర్నీలో కూడా రెండుసార్లు పోటీ పడే ఛాన్స్ ఉంటుంది.
దీంతో, నవంబర్ నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య కనీసం రెండు సార్లు, గరిష్ఠంగా నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో జరిగిన హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత, ఈ మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాబోయే పోరులో ఉత్కంఠ, ప్రతిష్ట, రివెంజ్ అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయి.
