ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వైసీపీ నాయకులు ధన దాహనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏటిఒడ్డుపర్త గ్రామంలో ప్రభుత్వ స్థలంలోని టేకు చెట్లను దొంగతనంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలోని చెట్లను రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తున్న నలుగురు వ్యక్తులను వాహనంతో సహా గ్రామస్తులు అడ్డగించారు. దొరికిన వాహనంలో ఎక్కించిన టేకు దుంగలు ప్రభుత్వ స్థలంలోనిది అని అక్రమార్కుల కళ్ళు దానిపై ఉందని స్థానిక ఎమ్మార్వో కు మరియు ఫారెస్ట్ అధికారులకు పిర్యాదు చేశామని గ్రామానికి చెందిన ఎందవ అప్పలనాయుడు, టంకాల బెనర్జీ మీడియా ప్రతినిధులకు తెలిపారు.
సదరు అధికారులు వేలంపాట వేసి టేకు చెట్లను తరలించి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బు చేరేలా చేస్తామని చెప్పి చెట్లను నరికించి దుంగలకు మార్కింగ్ సైతం వేశారు. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీ బావమరిది అర్ధరాత్రి పూట ప్రభుత్వం గుర్తించి మార్కింగ్ చేసి మరీ వేలంపాటకు సిద్ధంగా ఉంచిన టేకు చెట్లను తన సొంత ఆస్తి లాగా ధర్జాగా తరలించే ప్రయత్నం చేసినట్టుగా గ్రామస్తులు తెలిపారు. అక్రమాలకు అలవాటు పడిన వైసీపీ నాయకులు ప్రభుత్వ సొత్తును కూడా దోచుకోడానికి సిద్దపడడం దారుణమని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ తరహా దొంగ రవాణాలు జరగకుండా అక్రమార్కుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని మీడియా ముఖంగా గ్రామస్తులు కోరుకుంటున్నారు.
