ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. తాజాగా ఐసీసీ ఈ టోర్నీకి సంబంధించి ప్రైజ్ మనీని అధికారికంగా ప్రకటించింది.
విజేత జట్టుకు రూ.20.80 కోట్లు ప్రైజ్‌మనీ అందించనున్నారు. రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.10.40 కోట్లు లభించనుంది. సెమీ ఫైనల్స్‌కు చేరిన జట్లకు చెరో రూ.5.20 కోట్లు ఇవ్వనున్నారు. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.3 కోట్లు… ఏడో, ఎనిమిదో స్థానాల్లో ఉన్న జట్లకు రూ.1.20 కోట్లు అందజేయనున్నారు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్థాన్‌కు రూ.14.18 కోట్లు లభించగా, రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు రూ.7 కోట్లు వచ్చాయి. సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లకు చెరో రూ.3 కోట్లు లభించాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రూ.58 లక్షలు అందుకున్నాయి.
భారత జట్టు ఈసారి తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మార్చి 1న న్యూజిలాండ్‌తో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది.