పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది పాతబస్తీలో మెట్రో రైల్వే నిర్మాణానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
మెట్రో నిర్మాణాల కారణంగా చారిత్రక కట్టడాలకు నష్టం కలుగుతోందని, పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా పనులు జరుగుతున్నాయని ఏపీడబ్ల్యూఎఫ్ పిటిషన్‌లో పేర్కొంది.
చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చట్టబద్ధ నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ హాజరై వాదనలు వినిపించారు. పాతబస్తీ అభివృద్ధికి మెట్రో ప్రాజెక్టు కీలకమని, అభివృద్ధి పనులను అడ్డుకునేందుకే పిటిషన్ దాఖలైందని ఆయన వివరించారు.
ప్రధాన న్యాయమూర్తి మెట్రో రెండో దశ డిజైన్, నిర్మాణ పనులపై ప్రశ్నించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రెండో దశ పనులు కొనసాగుతున్నాయని ఏఏజీ సమాధానం ఇచ్చారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, చారిత్రక కట్టడాల వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాప్‌ను సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
