మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తోంది.
ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ముఖ్య అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో ప్రభాస్ రుద్రుడిగా దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, మోహన్‌లాల్ తీసుకున్న పారితోషికంపై ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్, మోహన్‌లాల్ ఇద్దరూ ఈ చిత్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. వారి తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతోనే వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని తెలిపారు.
ఈ వార్తను తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో వారి గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు. తమ అభిమాన నటులు పారితోషికం తీసుకోకుండానే ఇలా ఓ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని తెలియడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘కన్నప్ప’పై అంచనాలు మరింత పెరిగాయి.