కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్య ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దోచుకుని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనను తెలుసుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, మిగిలిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
నిందితులు హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. బాధితురాలు ఢిల్లీకి చెందిన మహిళ కాగా, ఆమె తన స్నేహితుడిని కలిసేందుకు గురువారం రాత్రి హోటల్‌కు వెళ్లింది. నిందితులు ఆమెను నమ్మించి హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనకు బాధితురాలి స్నేహితుడే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే ఆమెను హోటల్‌కు రప్పించాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించి, ఆమెకు మానసికంగా సహాయం అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.