హెటిరో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి ఆరోగ్యం విషమించడంతో విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తగిన చికిత్స అందించాలని, భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. హెటిరో పరిశ్రమలో భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించాలనుకున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సాధ్యపడలేదని తెలిపారు. త్వరలో పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదాల నివారణ కోసం పరిశ్రమలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
విశాఖ కేజీహెచ్ ఘటనలో రౌడీషీటర్ అరెస్టయినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతను బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేజీహెచ్ భద్రతను పరిశీలించేందుకు త్వరలోనే అక్కడ సందర్శన చేయనున్నట్లు తెలిపారు.
గంజాయి అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మంత్రి అనిత స్పష్టం చేశారు. డ్రోన్ల సహాయంతో గంజాయి ఉత్పత్తి, సరఫరాను కట్టడి చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి విక్రయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.

 
				 
				
			 
				
			 
				
			