పహల్గామ్ ఉగ్రదాడిలో తన భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ను కోల్పోయిన హిమాన్షి నర్వాల్ ఓ ఉదాత్తమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. భర్త స్మారకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరైన ఆమె, మీడియాతో మాట్లాడుతూ — తనకు ముస్లింలపై, కశ్మీరీలపై ద్వేషం లేదని, శాంతి మరియు న్యాయమే తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. “మత ఘర్షణలకు తెరపడాలి. ఇది వినయ్ ఆకాంక్ష కూడా,” అని ఆమె ఉద్వేగంతో అన్నారు.
ఈ రక్తదాన శిబిరాన్ని నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ ప్రజల్లో ఉన్న ఆవేశాన్ని తాను అర్థం చేసుకున్నానని హిమాన్షి పేర్కొన్నారు. అయితే, ఆవేశంలో మతాలపై ద్వేషాన్ని పెంచుకోవడం సమంజసం కాదని, అన్ని మతాలవారూ సమానమని ఆమె ఆకాంక్షించారు. ఈ సమయంలో శాంతి, ఐక్యత అత్యంత అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి నర్వాల్ ఒక పీహెచ్‌డీ విద్యార్థిని. కేవలం మూడు రోజుల వివాహ జీవితానికే ఆమె భర్తను కోల్పోయారు. ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్‌తో ఆమె వివాహం జరగగా, ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం వారు హనీమూన్ కోసం కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లారు. అక్కడే ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ ప్రాణాలు కోల్పోయారు.
వినయ్ నర్వాల్ అంత్యక్రియలు హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించబడ్డాయి. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని పరామర్శించగా, ఆమె భర్త శవపేటిక ముందు ఇచ్చిన సెల్యూట్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. అంతటి విషాదం మధ్యలోనూ ద్వేషం మార్గాన్ని కాకుండా శాంతి మార్గాన్ని ఎంచుకున్న హిమాన్షి నర్వాల్ ధైర్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 
				 
				
			 
				
			 
				
			