ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హై వోల్టేజ్ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే భారీగా అమ్ముడుపోయాయి. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిమానుల హంగామా తారాస్థాయికి చేరనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెందిన పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.
భారత జట్టు బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి, ఉత్సాహంతో ఉంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ శతకం సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా రోహిత్ బ్యాట్ నుంచి పరుగులు రావడం ప్రారంభమైతే, ప్రత్యర్థులకు ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు.
“రోహిత్ ఫామ్‌లో ఉన్నా లేకపోయినా అది నాకు ముఖ్యం కాదు. అతను పరుగులు చేయడం మొదలైతే ఆపడం ఎవరి తరం కాదని” యువరాజ్ వ్యాఖ్యానించాడు. “వన్డే క్రికెట్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ కన్నా మ్యాచ్ విన్నర్లు మరెవరూ లేరు. రోహిత్ శర్మ తన రోజున 60 బంతుల్లో సెంచరీ బాదగలడు. ఫోర్లు, సిక్సర్లతో వేగంగా పరుగులు చేయగల సత్తా అతనికి ఉంది” అని తెలిపారు.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లు తలపడనుండటంతో క్రికెట్ ప్రపంచం ఈ పోరును ఆసక్తిగా గమనిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి!

 
				 
				
			 
				
			 
				
			