ఉదయం లేవగానే టీ, కాఫీ తాగే అలవాటును మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని స్వాభావిక డ్రింక్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక బరువును తగ్గించేందుకు, జుట్టు, చర్మానికి మేలు చేయడానికి ఉపయోగపడతాయి.
తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగితే శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించుకోవచ్చు. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పరగడుపున తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందటానికి వెల్లుల్లిని నమిలి గోరువెచ్చని నీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉసిరి గుజ్జుతో గోరువెచ్చని నీరు తాగడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నిత్యం ఉదయాన్నే ఈ డ్రింక్ తీసుకోవడం శ్రేయస్కరం.
తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి, తెల్లవారితే ఆ నీటిని తాగితే చర్మం మృదువుగా, నిగనిగలాడేలా మారుతుంది. జుట్టు, దంతాలకు మేలు కలుగుతుంది. తులసి ఆకులు శరీరాన్ని డిటాక్స్ చేసి జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తాయి. ఈ స్వాభావికమైన ఆరోగ్య పానీయాలను రోజూ అలవాటు చేసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.