గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. క్రిస్టియన్ సంఘాలు ఇది సాధారణ ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం చేయగా, సీఎం చంద్రబాబు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో కేసు అనుమానాస్పద మృతిగా నమోదు అయింది. పోలీసులు ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఇది సాధారణ ప్రమాదం కాదని, ఎక్కడో చంపి రోడ్డు పక్కన పడేశారని ఆరోపించారు. ఈ కేసును పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని, తన వద్ద దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై పోలీసులు హర్ష కుమార్‌కు నోటీసులు జారీ చేశారు.
విచారణకు హాజరుకావాలన్న పోలీసుల సూచనను హర్ష కుమార్ పట్టించుకోకపోవడంతో, పోలీసులు తాజాగా ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 196, 197ల కింద కేసు నమోదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ హర్ష కుమార్ తన ఆరోపణలపై మళ్లీ నిలబడి మీడియా ముందుకు వచ్చారు.
తాజా మీడియా సమావేశంలో హర్ష కుమార్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను చెప్పిన విషయాలను నిరూపించే ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పోలీసులు తనపై కేసులు పెడితే వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఈ కేసు రాజకీయ దాడిగా మారుతుందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.