సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్ (28), చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్ పల్లి మండలం బల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్ తన బైక్‌పై కొండకల్ గ్రామం నుంచి వెలిమెల వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వెలిమెల తండా గ్రామ శివారులో అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చి ఢీకొనడంతో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మరణ వార్త అతని కుటుంబ సభ్యులను, సహచరులను విషాదంలో ముంచేసింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. అడవి ప్రాణుల కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వెంటనే ఆసుపత్రికి చేరుకుని శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీనివాస్ ఎంతో సౌమ్యుడని, ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి అని, నాలుగేళ్లుగా తన వద్ద గన్ మెన్‌గా విధులు నిర్వహిస్తూ ఎంతో నిబద్ధత చూపించాడని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి ఆప్తుడిని కోల్పోవడం తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అడవి పందుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు అధికారుల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అడవి ప్రాణులు రోడ్లకు వస్తుండటంతో ఇటువంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని, వీటి నివారణ కోసం అడవి ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని వాదిస్తున్నారు.
